న్యూఢిల్లీ : రియో డి జానరోలో జరుగుతున్న ప్రపంచకప్ మహిళల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ నిశ్చల్ రజత పతకం గెలుచుకున్నది. 50మీ రైఫిల్ ఈవెంట్‌లో నార్వే షూటర్ జానెట్ హెగ్ డుసాడ్ తొలి స్థానంలో నిలిచింది. ఫైనల్లో నిశ్చల్ 458 పాయింట్లు స్కోర్ చేసింది. ఎయిర్ రైఫిల్ యురోపియన్ చాంపియన్ అయిన డుసాడ్.. వరల్డ్‌కప్‌లోనూ ఆధిపత్యాన్ని చాటింది. ఇండియన్ షూటర్ నిశ్చల్ ఇవాళ టాప్ ఫామ్ కనబరిచింది. మహిళల 3పీ ఈవెంట్‌లో ఆమె జాతీయ క్వాలిఫైయింగ్ రికార్డును బ్రేక్ చేసింది. ఇది తన తొలి వరల్డ్‌కప్ ఫైనల్ అని, దీంట్లో మెడల్ దక్కడం సంతోషంగా ఉన్నట్లు నిశ్చల్ పేర్కొన్నది. ఉదయం రెండుసార్లు ఎలిమినేషన్ రౌండ్లు జరిగాయి. మొత్తం 18 మంది షూటర్లు ఎలిమినేట్ అయ్యారు. ఈవెంట్‌కు క్వాలిఫై అయ్యేందుకు రిలే రౌండ్‌లో నిశ్చల్ 587 స్కోర్ చేసింది. ఇక క్వాలిఫికేషన్ రౌండ్‌లో 592 పాయింట్లు స్కోర్ చేసింది. ప్రోన్ పొజిషన్‌లో 200 పాయింట్లు సాధించింది. రియో వరల్డ్‌కప్‌కు వెళ్లిన 16 మంది బృందంలో.. మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఇలవేనిల్ వలారివన్ స్వర్ణ పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే.