సూర్యుడికి చేరువైన పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను వినియోగించి సౌర తుఫాన్‌లపై నాసా ప్రత్యేక అధ్యయనం చేస్తున్నది. సూర్యుడి నుంచి ఉత్పన్నమయ్యే సౌర తుఫాన్ల ముప్పు భూమికి పొంచి ఉన్నది. వచ్చే దశాబ్దంలో భూమిని తాకే అవకాశం ఉందని భావిస్తున్న తీవ్ర సౌర తుఫాను వల్ల ప్రపంచంలో కొన్ని నెలలపాటు ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉన్నది. ఈ పరిస్థితినే ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’ అంటారు. దీని వల్ల ఉపగ్రహాలు, విద్యుత్తు లైన్లకు ముప్పు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సౌరతుఫాన్లపై లోతైన అధ్యయనం చేస్తున్నట్టు కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టువర్ట్ బేల్ తెలిపారు. సూర్యుడు విడుదల చేసే శక్తి, సమాచార వ్యవస్థలను దెబ్బతీయగలిగే భూఅయస్కాంత తుఫాన్ల గురించి తెలుసుకోవచ్చని చెప్పారు.