- సర్వే నెంబర్స్ 12, 6 ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలలో
రెవెన్యూ అధికారుల వాటా ఎంత? - పక్కనే ఉన్న పేదల కట్టడాలను కూల్చి పెద్దల నిర్మాణాలను వదిలేసిన వైనం….
- అమీన్ పూర్ మండలంలో అధికార పార్టీ నాయకుల అక్రమాలను
సక్రమం చేస్తున్న అధికారులు… - ఏండ్లు గడుస్తున్నా నోటీసులతోనే సరిపెడుతున్న పటేల్ గూడ
కార్యదర్శి ఉమా మహేశ్వర్… - కోర్టుకు వెళ్లాలంటూ అక్రమార్కులకు సూచిస్తున్న అధికారులు….
- రెండుసార్లు కూల్చినా ఆగని అక్రమ నిర్మాణాలు…
- అక్రమార్కులకు అండదండలు అందిస్తున్న కార్యదర్శిపై
పంచాయితీ రాజ్ చట్టం 2018 ప్రకారం చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్… - పటేల్ గూడ కార్యదర్శి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఆదాబ్ ప్రతినిధులు….
ఎన్నో ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా పయనించాలని అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను ముందుండి నడిపించాల్సిన ప్రభుత్వ అధికారులే.. వారి స్వార్థ ప్రయోజనాల కోసం, భవిష్యత్తు తరాల అవసరాలకు ఉపయోగపడే కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, అక్రమార్కులు చెర పడుతుంటే కన్నెర్ర చేసి కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, కాసులకు కక్కుర్తి పడి ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న నిర్మాణాలకు పచ్చ జెండా చూపిస్తూ పరోక్ష సహకారం అందించడం ముఖ్యమంత్రి కంటున్న కలలను కాలరాయడమే అవుతుంది… కొందరు భూ కబ్జాదారులు అధికార పార్టీలో చేరి, తమ అక్రమ దందాలను కొనసాగిస్తుండడం.. వారికి అధికారులు సంపూర్ణ సహకారాన్ని అందిస్తుండడంతో అధికార పార్టీతో పాటు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసనీయతను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
సంగారెడ్డి జిల్లాలోని, అమీన్ పూర్ మండలం, పటేల్ గుడా గ్రామ శివారులోని సర్వేనెంబర్స్ 12, 6 లోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 28 విల్లాల నిర్మాణం చేపట్టినా.. కూల్చివేయాల్సిన అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులకు అధికారులే పచ్చ జెండా చూపిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక రెవెన్యూ అధికారులుతో పాటు గ్రామ కార్యదర్శి సైతం అక్రమార్కులకు కోర్టుకు వెళ్లాలని సూచిస్తుండడం విస్మయానికి గురిచేస్తుంది.. అమీన్ పూర్ మండలంలో అధికార పార్టీ నాయకుల కబ్జాలను అధికారులే దగ్గరుండి మరీ సక్రమం చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.. గతంలో సర్వేనెంబర్స్ 12, 6 లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు రెండుసార్లు కూల్చివేసినా కబ్జాదారుడు తిరిగి యదేచ్ఛగా నిర్మాణం పనులు చేపట్టేందుకు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు, పటేల్ గూడ గ్రామ కార్యదర్శికి పెద్ద ఎత్తున అమ్యామ్యాలు అందజేశారని తెలుస్తోంది.. అక్రమ నిర్మాణాలకు అతి సమీపంలోని ప్రధాన రోడ్డు గుండా వేసిన చిన్న చిన్న డబ్బాల నుండి, భారీ షెడ్లను కూల్చివేసిన అధికారులు ప్రభుత్వ భూమిలో వెలసిన విల్లాలను కూల్చివేయకపోవడంతోనే అధికారులకి, నిర్మాణదారుడుకి ఉన్న సత్సంబంధాలను తెలియజేస్తుంది.. అక్రమార్కులకు అండదండలు అందిస్తున్న పటేల్ గూడా గ్రామ కార్యదర్శిపై పంచాయితీ రాజ్ చట్టం 2018 ప్రకారం చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి కబ్జాదారుడిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పటేల్ గూడ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు తొలగించి, ప్రజల డిమాండ్ ను నెరవేరుస్తారా ? లేదా వారు సైతం అధికార పార్టీ నాయకుల ఆదేశాలకు తలొంచి, వారు ఇచ్చిన అమ్యమ్యాలను స్వీకరించి, అక్రమాలను సక్రమాలు చేసేందుకు పచ్చ జెండా ఊపుతారా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.. తమ వంతు పాత్రని ఏ విధంగా నిర్వహిస్తారో వేచి చూద్దాం.. పటేల్ గూడా గ్రామ పంచాయతీలో ఎన్ని నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు…? గ్రామ పంచాయతీలో జరుగుతున్న అక్రమాలపై మరిన్ని కథనాలు పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకురానుంది.. ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై హస్తం ‘..