- ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం : వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
తాండూరు : రాజకీయ పార్టీలు తమ గెలుపు కోసం ఓటర్లను ప్రలోభ పెడితే చర్యలు తప్పవని, సి విజిల్ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా వారికి మద్యం, డబ్బులు, ఇతరత్రా పంపిణీ చేయడంపై సి-విజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం సి- విజిల్ లో ఫిర్యాదు వచ్చిన తర్వాత కేవలం 100 నిమిషాల్లో ఆ ఫిర్యా దుకు సంబంధించిన పూర్తి దర్యాప్తును ముగిస్తామన్నారు. ఎన్నికల ఖర్చుల సందర్భంగా అభ్యర్థులు ప్రతిరోజు లెక్కలను అందజేయాలన్నారు. అభ్యర్థుల ఖర్చులపై నిఘా టీములు ఎల్లవేళలా పరిశీలిస్తు న్నాయన్నారు ఖర్చుల వివరాలను తప్పుగా సమర్పిస్తే గెలిచిన అభ్యర్థి అయినా కూడా అనర్హత వేటు పడుతుందన్నారు. ఈనెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1133 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద అన్ని వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 9.60 లక్షల ఓటర్లకు ఓటర్ స్లిప్స్ ను అందజేస్తున్నామన్నారు . ఇప్పటికే 50% పైగా వారికి అందించామన్నారు. నూతన ఓటర్లకు సైతం వారి పోలింగ్ స్లిప్పులను వారి ఇళ్లల్లో అందజేస్తున్నామన్నారు. పోలింగ్ రోజున ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ హెల్ప్ డెస్క్ ఉంటుందన్నారు. పోలింగ్ సిబ్బందికి రేపటినుండి రెండవ విడత శిక్షణ ఉంద న్నారు ఆ రోజే పోస్టల్ బ్యాలెట్ లను వారికి అందిస్తామన్నారు ఇప్పటికే 7 వేలకు పైగా పోస్టల్ బ్యాలె ట్లు వచ్చాయన్నారు. 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు దివ్యాంగులకు ఈనెల 23 24 తేదీన ఓటింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. పోలింగ్ కు 48 గంటల ముందు అనగా ఈనెల 28 సాయంత్రం వరకు ప్రచార కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. తదనంతర0 48 గంటలు అనగా పోలింగ్ రోజు వరకు గట్టి నిఘా ఉంటుందన్నారు. ఓటర్లందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో మీ సమస్యలను పరిష్కరించే అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.