వందతపప్పులు చేసిన శిశుపాలుడు కేసీఆర్
ఈ ఎన్నికలతో బొందపెడితేనే యువతకు న్యాయం
- కల్వకుంట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతాయ్
- కాంగ్రెస్ రాగానే కేసీఆర్ కుటుంబం కరెంట్ కట్
- భూదోపిడీని అడ్డుకుని బోనులో నిలబెడతాం
- వెయ్యెకరాల ఫామ్‌హౌజ్‌తో పేదలకు టోపీ
- కేటీఆర్‌కు వందెకరాల్లోజన్వాడ ఫామ్ హౌజ్
- చెప్పులు లేని వారంతా ఎమ్మెల్యేలు, మంత్రులు
- ఎర్రబెల్లికి ఉన్న అర్హతల్లా కేసీఆర్‌తో చుట్టరికమే
- ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెల్వకుంటే కష్టాలు తప్పవు
- ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రచారంలో రేవంత్ రెడ్డి
వరంగల్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల కుటుంబం ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్షలకోట్ల అవినీతిని కక్కిస్తామని, భూదోపిడీని బట్టబయలు చేస్తామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ ఫ్యామిలీ కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ ల కరెంట్ ఊడగొడుతం అన్నారు. మంగళవారం నాడు వర్ధన్నపేట విజయభేరి సభ నిర్వహించారు. ఈ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ముందు చెప్పులు గతి లేని వ్యక్తులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. ల్యాండ్ పూలింగ్‌తో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోతే పోలీస్ బూట్లతో తన్నించారు. ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు చేయలేదు.
ఎన్నికలు వస్తున్నాయని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ల్యాండ్ పూలింగ్ జీవో రైతుల మెడ విూద కత్తిలా ఉంది. కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా విద్యార్థులు త్యాగం చేస్తే ఇప్పుడు వాళ్లను అణచివేస్తున్నారు. కేసీఆర్ మూడోసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాడు. కేసీఆర్ మనవడికి కూడా పదవి కావాలని చూస్తున్నాడు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దిగమింగాడు. తెలంగాణ రైతులను, విూడియాను తీసుకొని కాళేశ్వరం వెళ్దాం. ఇసుక కదిలితే బ్యారేజ్ వంగుతదా… బుద్దున్నొడు ఇసుక విూద బ్యారేజ్ కడతాడా..
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానన్న సన్నాసి, ఎంత మందికి ఇచ్చావు. వెయ్యి ఎకరాల ఫార్మ్ హౌస్ కట్టుకున్నావని అంటూ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో పది ఎకరాల గడీని కట్టుకున్నాడు. ఇంటికో ఉద్యోగం అని ప్రజలను మోసం చేసి తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెల ప్రారంభంలో జీతం ఇచ్చాము. 20వ తేదీ వచ్చినా జీతాలు ఇయ్యలేని దుస్థితికి కేసీఆర్ తెలంగాణ రాష్టాన్రికి తెచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఎర్రబెల్లి దయాకర్‌రావు కరెంట్ తీసేస్తా. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే దొర దగ్గర బానిసలుగా పడిఉంటారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే విూకోసం ప్రశ్నిస్తారు. హావిూ ఇచ్చి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలు ఇప్పుడు హావిూ ఇస్తున్నాం, వచ్చే నెలలో అమలు చేసి తీరుతామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఎవడిపాలైంది, ఇప్పుడు ఎవడేలుతున్నడు అని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు గుంజుకున్న వ్యక్తి ఇక్కడి ఎమ్మెల్యే, అదేమని ప్రశ్నించిన వారిని పోలీస్ బూటు కాలితో తన్నించిన వ్యక్తి అరూరి రమేష్ అని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే ల్యాండ్ పూలింగ్ జీవోను తాత్కాలికంగా ఆపారని రేవంత్ రెడ్డి చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పిండు. కానీ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది.. సిందిళ్లకు దిక్కులేదు అని బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టిండు. బుద్ది ఉన్నవాడు ఎవడైనా ఇసుకపై బ్యారేజీ కడతాడా అని కేసీఆర్ ను నిలదీశారు. నిజంగా ప్రమాదంతోనే ప్రాజెక్టు కూలితే.. ప్రజలకు ఎందుకు చూపించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఓట్లు వేసి బీఆరెస్ ను గెలిపిస్తే ఆ జీవోనే విూ మెడ విూద కత్తిగా మారి వేలాడుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ తెచ్చుకున్నం. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ దొర కాళ్ల కింద నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వంద గదులతో గడీని నిర్మించుకుండని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జన్వాడలో 100 ఎకరాలలో కోట్లు ఖర్చు పెట్టి కేటీఆర్ ఒక గడీని కట్టుకున్నారు. కానీ ధనిక రాష్ట్రంలో ప్రతీనెలా మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటుండు.. కాంగ్రెస్ రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, దయాకర్ రావు, కవిత రావు ల కరెంట్ ఊడగొడుతం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాగానే.. కేసీఆర్ విూ మోటర్లు కాలుతాయ్, విూ ట్రాన్స్ఫార్మర్స్ పేలుతాయ్ అంటూ హెచ్చరించారు. చదువురాని దయాకర్ కేసీఆర్ చుట్టం అనే ఒక్క అర్హతతో మంత్రి అయిండని విమర్శించారు. ఈ ఎన్నికలు పోలీసులు దొంగల మధ్య జరుగుతున్న ఎన్నికలు అని, విూరు ఎవరివైపు ఉంటారో తేల్చుకోండి అని ప్రజలకు రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ సీఎంలుగా చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నారు! అలాగే స్టేషన్ ఘనపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంటే రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజయ్య, శ్రీహరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరి గురించి మరొకరు ఇప్పటికే నిజాలు బయటపెట్టారంటూ సెటైర్లు వేశారు. ఇద్దరూ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నోల్లేనని.. సీఎం కేసీఆర్ కే వీళ్లపై నమ్మకం లేదు. ఇంక ప్రజలు ఎలా నమ్ముతారని అడిగారు. కేసీఆర్ ఇచ్చిన హావిూలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బీఆరెస్ ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే.. కాంగ్రెస్ 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చిందన్నారు రేవంత్. సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుంటుంటే.. మంత్రి దయాకర్ రావు వాళ్లను ఖాళీ సీసాలు అమ్ముకోమంటారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది.. నిరుద్యోగ యువతి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంటే.. ఈ ప్రభుత్వం ఆ కుటుంబం పరువును బజారుకీడ్చిందన్నారు. వంద తప్పులు పూర్తయ్యాక శిశుపాలుడి శిరచ్ఛేదనం జరిగిందని, పాపాల భైరవుడు కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని.. ఈ ఎన్నికల్లో శిరచ్ఛేదనం జరగాల్సిందే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నేల కూలాల్సిందే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘనపూర్‌లో ఇందిరమ్మను 25వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు.