- పకడ్బందీగా పోలీసులు తనిఖీ చేయాలి : వీ.హెచ్.పీ.
- తూతూ మంత్రంగా వాహనాలు వదిలేయడం సరికాదు
- గోరక్షకు ప్రయత్నం చేస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయం
- బజరంగ్ దళ్ కార్యకర్తలను బైండోవర్ పేరుతో భయభ్రాంతులను సృష్టించడం చట్ట విరుద్ధం
- మజిలీస్ పార్టీ ఆగడాలను కట్టడి చేయలేక పోతున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఓల్డ్ సిటీలో గొర్రెల మందల్లా.. నిలిపి ఉన్న ఆవుల మందలను గోశాలలకు తరలించాలి
- డిజిపిని కలిసిన వీ.హెచ్.పీ. రాష్ట్ర బృందం
హైదరాబాద్, రాష్ట్రంలో గో నిషేధ చట్టాలు ఏమాత్రం అమలు కావడం లేదని.. ఇష్టారాజ్యంగా వధించేందుకు గోవులను తరలిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ని కలిసి విశ్వహిందూ పరిషత్ బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. చట్ట విరుద్ధంగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గోవులను తరలిస్తున్న వారి వివరాలను పోలీసులకు తెలుపుతున్న బజరంగ్దళ్ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని.. ఇలా చేయడం చట్ట విరుద్దమని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్ళింది. కబేలాలకు తరలిస్తున్న గోవుల విషయాలను పోలీసులకు తెలియజేస్తున్న కార్యకర్తలపై పోలీసులు బెదిరింపులకు దిగడం సమంజసం కాదని సూచించింది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసేలా కారణంగా బజరంగ్దళ్ కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కేసులు పెట్టి వేధింపులకు దిగడం పై స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ముఖ్యంగా భాగ్యనగర్ శివారు ప్రాంతాలలో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ల వద్ద ఎంఐఎం నేతలు పోలీసులకు దంకీ ఇస్తున్నారని వీ.హెచ్.పీ. నేతలు సూచించారు. చుట్టాలను ఉల్లంగించి పోలీసులపై దుర్భాషలాడుతున్న కూడా పట్టించుకోవడంలేదని వివరించారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను నిలిపివేయడంతో, పోలీసులను బెదిరించి వాటిని తరలించుకు వెళ్తున్నారని సూచించారు. ఇలాంటి వ్యవహారంలో ఎంఐఎం కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు నేరుగా భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పారు. పట్టుకున్న ఆవులను వెంటనే గోశాలలకు పంపించాలని.. చట్ట విరుద్ధంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. గోరక్షణ కోసం అనేక చట్టాలు ఉన్న కూడా వాటిని అమలు చేయకపోవడం దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిపిని కలిసిన వారిలో విశ్వ హిందు పరిషత్ రాష్ట్ర సహ కార్య దర్శి భాను ప్రకాష్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర బజరంగ్ దళ్ ప్రముఖ్ శివ రాములు, న్యాయవిభాగం ప్రముఖ్ శివ ప్రసాద్ ఉన్నారు.
ఈ సందర్భంగా డిజిపి అంజని కుమార్ మాట్లాడుతూ.. గోవుల అక్రమ రవాణా పై చట్టపరమైన చర్యలు తీసుకొనేలా అధికారులను ఆదేశిస్తానన్నారు. భాగ్యనగరంలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలను పకడ్బందీగా గోరక్షణ చేయాలని సూచిస్తానని డిజిపి చెప్పారు.