- డిప్యూటీ స్పీకర్ పద్మారావు వెల్లడి..
- వీసితో కలిసి కొత్త రోడ్డు పనుల పరిశీలన
ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తామని, కొత్త అప్రోచ్ మార్గాన్ని ఏర్పాటు చేయడంలో సహకరిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడిక్ మెట్ నుంచి విద్యానగర్ మీదుగా దాదాపు 1.20 కిలోమీటర్ల దురాన్ని కలుపుతూ దాదాపు రూ.16 కోట్ల ఖర్చుతో కొత్త అప్రోచ్ రోడ్డు ను, ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ వరకు మరో లింక్ రోడ్డును ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ప్రతిపాదిస్తున్న నేపధ్యంలో ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్, వివిధ విభాగాల అధికారులతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ బుధవారం ప్రతిపాదిత మార్గాలను పరిశీలించారు. ఉస్మానియా యూనివర్సిటీ ని కలుపుతూ ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ రహదారుల్లో నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటున్న దశలో యూనివర్సిటీ అధికార యంత్రాంగం వివిధ ప్రత్యామ్యాయ రహదారులను కొత్తగా ప్రతిపాదిస్తోంది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఉస్మానియా విశ్వ విద్యాలయానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. విశ్వవిద్యాలయం సిబ్బంది, విద్యార్ధులకు సదుపాయాలను కల్పించడంలో తాము కృషి చేస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జోనల్ కమీషనర్ రవికిరణ్, ఇంజనీరింగ్ అధికారులు రహీం, అనిల్ రాజ్, ఆశలత, స్వర్ణ లత, వెంకటేష్, పట్టాణ ప్రణాలిక అధికారిణి రజిత, తాసిల్దార్ హేమంత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలనా యంత్రాంగం చేస్తున్న వివిధ ప్రతిపాదనలను ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్ ఈ సందర్భంగా వివరించారు.