వైఎస్ వివేకా హత్యకేసులో నేర ఆరోపణలకు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను సమర్థించిన తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వైఎస్ వివేకానందారెడ్డి కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని స్వయంగా కోర్టులో సునీతారెడ్డి వాదనలు వినిపించారు.
సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చిందని పేర్కొన్నారు. నిందితులు సాక్షులను ఎంపీ అదేపనిగా బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇందుకు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ఎంపీ అవినాష్‌కు సహకరిస్తోందని వివరించారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్లిన సీబీఐ అధికారులను అడ్డుకున్నారని, తల్లికి అనారోగ్యం పేరుతో తప్పించుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలిసిందని సీబీఐ ఇటీవల తాజాగా పేర్కొన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.వాదనాలను విన్న సుప్రీం కోర్టు అదనపు పత్రాల సమర్పణకు అవకాశమివ్వాలని సూచించారు.