Tuesday, October 15, 2024
spot_img

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష విధానంలో మర్పులు

తప్పక చదవండి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల్లో డిస్క్రిప్టివ్‌ విధానం కాకుండా ఆబ్జెక్టివ్‌ విధానం అమలుపై సమాలోచనలు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెల్పింది. గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల నిర్వహణకు యూపీఎస్సీ బాట నుంచి ఏపీపీఎస్సీ వైదొలుగుతోంది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను డిస్క్రిప్టివ్‌ విధానంలో కాకుండా, ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిపితే వాటి నియామకాల లక్ష్యమే దెబ్బతింటుందని పలువురు నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య ఉన్న అనుసంధానం కూడా తెగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ తాజా ప్రకటనతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తూ ప్రస్తుత సిలబస్‌కు అనుగుణంగా సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో గందరగోళం చోటు చేసుకుంది. వీరంతా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌లకు, గ్రూప్‌1 పరీక్షలకు ఉమ్మడిగా సన్నద్ధమయ్యే వీలు కోల్పోయినట్లవుతుంది. సివిల్స్‌, గ్రూప్‌ 1కు విడివిడిగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానం అయితే అభ్యర్ధుల తార్కిక జ్ఞానాన్ని అంచనా వేయడానికి, వారి ఆలోచనలను వివరించడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండదు. అంతేకాకుండా కాపీయింగ్‌కు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలోనైతే అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమవుతుంది. ఐదు, ఆరు ప్రశ్నలకు ఆన్సర్‌ తెలియకపోతే అభ్యర్థులు మార్కుల విషయంలో ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో అయితే ఆ అవకాశం ఉండదు. రాసినంత మేర మార్కులు వస్తాయనే ఆశా భావం అభ్యర్ధుల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో అభ్యర్ధుల ర్యాంకింగ్‌ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానమైతే అభ్యర్థి తమ ఆలోచనలను ప్రజెంట్‌ చేసే విధానం, ఎలా రాస్తున్నారు, వారి సమయపాలన, విషయావగాహన, ఏకాగ్రత వంటి పలు అంశాలను మూల్యాంకనం సమయంలో పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ఈ ప్రతిపాదన తెరమీదకి వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆబ్జెక్టివ్‌ విధానంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో ఉన్న లోపాలను గ్రహించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో మెయిన్స్‌ పరీక్షలు జరపాలని యోచిస్తోంది. దీనిపై మహారాష్ట్రలో నిరుద్యోగులు ఆందోళన చేయడంతో.. ప్రస్తుతానికి డిస్క్రిప్టివ్‌ విధానాన్ని 2025 వరకు వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబరు 19న మీడియా సమావేశంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల్లో సబ్జెక్టుల వారీగా జవాబుపత్రాల మూల్యాంకనం క్లిష్టంగా మారిందన్నారు. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి పేపర్లకు ప్రొఫెసర్ల కొరతతోపాటు, మార్కుల కేటాయింపులో ప్రొఫెసర్లలో సారూప్యత కానరావడం లేదన్నారు. రెండు సార్లు వాల్యుయేషన్‌ తర్వాత కూడా 15 శాతం పేపర్లు మూడో సారి వాల్యుయేషన్‌కు వస్తున్నాయి. అందువల్లనే గ్రూప్‌-1 మెయిన్స్‌ పేపర్లలో కొన్నింటిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. 50 శాతం మార్కులకు డిస్క్రిప్టివ్‌ విధానం, మిగిలిన 50 శాతం ప్రశ్నలను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. యూపీఎస్సీ పేపర్ల మూల్యాంకనానికి జాతీయస్థాయిలో ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారని, రాష్ట్రాల్లో ఆ వెసులుబాటు లేదని అన్నారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌ మార్పుచేర్పులపై అభ్యర్థులు, మేధావులతో చర్చించి రెండువారాల్లోగా అభిప్రాయాలు తెలియజేస్తామన్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఒక పేపరుకే నిర్వహించే అవకాశం ఉందని, సిలబస్‌లో మార్పులు ఉండబోవని అన్నారు. కాగా అక్టోబరు నెలాఖరులో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రానుంది. ప్రస్తుతం ప్రకటించిన గ్రూప్‌-2 పోస్టుల కంటే అదనంగా మరికొన్ని ఖాళీలను చేర్చనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు