పాట్నా : బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొంది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు. అంతటితో అగకుండా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కర్రలతో కొట్టారు. బలవంతంగా మూత్రం తాగించి మృగాల్లా వ్యవహరించారు. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ దుశ్చర్య కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ తలపై బలమైన గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన ప్రమోద్ సింగ్, అన్షు తండ్రి కుమారులని పోలీసులు పేర్కొన్నారు. వీరు మరో నలుగురు వ్యక్తులతో కలిసి బాధిత మహిళ ఇంటికెళ్లి, ఆమెను బలవంతంగా వారి ఇంటికి తీసుకొచ్చారని వివరించారు. నిందితుల నుంచి మహిళ ఎలాగొలా తప్పించుకొని ఇంటికి చేరిందని, ప్రస్తుతం ఇద్దరు నిందితుతు పరారీలో ఉన్నారని తెలిపారు.