Friday, July 19, 2024

టివీ యాంకర్లను పార్టీలు బహిష్కరించడం సముచితంగా ఉందా..?

తప్పక చదవండి

పత్రికా, మీడియా స్వేచ్ఛలపై అధికార పార్టీలు సంకెళ్లు వేస్తున్నా యని, తమ వ్యతిరేక మీడియా వర్గాన్ని అణచివేతకు గురి చేస్తున్నా యనే పలు విమర్శలు అనాదిగా వింటూనే ఉన్నాం. ఇందిరాగాంధీ హయాంలో ఎమజెన్సీ విధించి పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారంటూ వాపోవడం కూడా చూసాం. వివిధ పార్టీలు తమ తమ పత్రికలు, చానెల్స్‌ను ప్రారంభించడం లేదా ఆయా చానెల్స్‌ పగ్గాలను తమ చేతులోకి తీసుకోవడం నేడు సర్వ సాధారణం అయ్యింది. ప్రతి చానెల్‌ ఏదో ఒక పార్టీ లేదా కార్పొరేట్‌ గుప్పిట్లో తమకు అనుకూలంగా, వ్యతిరేకులపై ఘాటు విమర్శలతో మీడి యాలను పెడదోవలో నడపడం ప్రజాస్వామ్యానికి చేటుగా నిలుస్తు న్నది. ఏ పత్రికను లేదా ఏ చానెల్‌ ప్రసారాలను, వార్తను నమ్మాలో తెలియక సామాన్య పత్రికా పాఠకుడు/టివీ వీక్షక శ్రోత జుట్టు పీక్కోవలసిన సందర్భాలు వస్తున్నాయి. వాస్తవ సమాచారాన్ని యథాతథంగా అందించే తటస్థ మీడియాలు పలుచబడిన వేళ, మీడియా ఆసాంతం రాజకీయ పార్టీలు/కార్పొరేట్ల అధీనంలోకి వెళ్లాయని మేధావులు ఆవేదన చెందుతున్నారు.
ఇండియా కూటమి బహిష్కరించిన వివిధ చానెల్స్‌ యాంకర్లు: ఇటీవల 13 సెప్టెంబర్‌ 2023న ‘ఇండియా (ఇండియన్‌ నేషనల్‌ డెవెలప్‌మెంట్‌ ఇన్‌క్లూజివ్‌ అలియన్స్‌)’ అనబడే 28-పార్టీల కూటమికి చెందిన మీడియా కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం తమ పార్టీలపై అసంబద్ధమైన వ్యతిరేక విష భావాలు/వార్తలను చిమ్ముతున్నారనే ఆరోపణలు తీవ్ర స్వరంతో చేయడంతో పాటు దేశవ్యాప్తంగా 14 మంది వివిధ టివీ చానెల్స్‌ ద్వారా ‘విధ్వేషపూరిత విశ్లేషణ’లతో పని చేస్తున్న మీడియా యాంకర్లను తమ పార్టీ సమావేశాలు, ఇతర సమావేశ సంబంధాల్లో పాల్గొనకుండా ‘బైకాట్‌ (బహిష్కరణ)’ చేస్తున్నామంటూ బహిరంగ ప్రకటన చేయడంతో మరోసారి పత్రికా/మీడియా స్వేచ్ఛపై పెద్ద చర్చ ప్రారంభమైంది. ఈ 14 మంది యాంకర్లు నిర్వహించే టివీ చర్చల్లో ఇండియా కూటమి పార్టీ ప్రతినిధులు పాల్గొనవద్దని నిర్ణయించినట్లు తెలిపారు. ఇండియా కూటమి పార్టీలు బైకాట్‌ చేసిన యాంకర్లలో అదిథి త్యాగి(భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ చానెల్‌), అమన్‌ చోప్రా(న్యూస్‌ 18 చానెల్‌), అమిష్‌ దేవగన్‌(న్యూస్‌ 18 చానెల్‌), ఆనంద్‌? నరసింహన్‌(న్యూస్‌ 18 చానెల్‌), అర్నాబ్‌ గోస్వామి(రిపబ్లిక్‌ టివీ), అశోక్‌ శ్రీవాస్తవ(డిడి న్యూస్‌ చానెల్‌), చిత్ర త్రిపాటి(ఆజ్‌తక్‌ చానెల్‌), గౌరవ్‌ సావంత్‌(టివీ టుడే నెట్‌వర్క్‌ చానెల్‌), నావికా కుమార్‌(టైమ్స్‌ నెట్‌వర్క్‌ చానెల్‌), ప్రాచీ పరాశర్‌(ఇండియా టివీ న్యూస్‌ చానెల్‌), రుబికా లియాఖత్‌ (భారత్‌24 చానెల్‌), శివ్‌ అరూర్‌(ఇండియా టుడే చానెల్‌), సుధీర్‌ చౌధరి(ఆజ్‌తక్‌ చానెల్‌), సుశాంత్‌ సిన్హా(టైమ్స్‌ నౌ చానెల్‌) అను వివిధ చాన్ల్స్‌కు చెందిన 14 మంది ఆంకర్లు ఉన్నారు.
రాజకీయ పార్టీలు, కార్పొరేట్ల చేతుల్లో కీలు బొమ్మలు: ఈ ఇండియా కూటమి బహిష్కరణ నిర్ణయం ‘ఎమర్జన్సీ-కాలపు మైండ్‌సెట్‌’ను వ్యక్తం చేస్తున్నదని భాజపా ప్రతినిధులు అనగా, ఈ నిర్ణయం బైకాట్‌ కాదని, ఆ ఆంకర్ల పట్ల ‘నాన్‌-కొఆపరేషన్‌’ మాత్రమే అని కాంగ్రేస్‌ తెలపడం కూడా విన్నాం. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యతిరేకమని, పత్రికా/మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతున్నదని మీడియా అభిమానులు అభిప్రాయపడు తున్నా రు. ఈ ఆంకర్లు తమ వార్తా విశ్లేషణ చర్చల్లో మన పార్టీలకు వ్యతిరేకంగా కావాలనే విషం చిమ్ముతున్నారని, వేరే మార్గం లేకపోవడంతో ఈ అసాధారణ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఇండియా కూటమి ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి ప్రజావ్యతిరేక మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే నిర్ణయాన్ని ‘న్యూస్‌ బ్రాడ్‌కాస్ట్‌ ` డిజిటల్‌ అసోసియేషన్‌’ కూడా వ్యతిరేకించడం చూసాం. నేటి డిజిటల్‌ యుగంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన టివీ చానెల్స్‌లో కొన్నింటికి ‘టిఆర్‌పీ’ ఆదరణ కొరవడినందున ఆర్థిక సమస్యల నుండి బయట పడడానికి వివిధ రాజకీయ పార్టీల లేదా కార్పొరేట్ల చేతుల్లో బొమ్మల్లా మారిపోయాయని కూడా వాదించే వారున్నారు. పార్టీల ప్రముఖ నాయకులే తమ తమ టివీ చానెల్స్‌ను నడపడం తో వాస్తవ వార్తల ప్రసారానికి మాయ తెరలు కమ్మి, తమ బాకా ఊదుకోవడానికి సిద్ధం అవుతున్నాయని కూడా వింటున్నారు.
ప్రపంచ సమస్యగా పత్రికా/మీడియా స్వేచ్ఛ: ఇటీవల ‘రిపోర్టర్స్‌ విత్‌అవుట్‌ బార్డర్స్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌)‘ సంస్థ విడుదల చేసిన ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక-2023’ వివిధ ప్రపంచ దేశాల పత్రికా స్వేచ్ఛల అధ్యయన వివరాలను వెల్లడిరచింది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛ వివరాలను అధ్యయనం చేయగా భారత్‌కు 161వ స్థానం (2022లో 150వ స్థానం) రావడం విచారకరమే. పత్రికా స్వేచ్ఛలో నార్వే(1), ఐర్లాండ్‌(2), డెన్మార్క్‌(3) దేశాలు తొలి మూడు స్థానాల్లో నిలిచి ఆదర్శంగా ఉండగా వియత్నాం(178), చైనా(179), ఉత్తర కొరియా(180)కు జాబితా చిట్ట చివరన ఉన్నాయి. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ నానాటి దిగజారుతున్నదని, మానవ హక్కుల హననం, ప్రజాస్వామ్య విలువల పతనం, రాజకీయ అనైతిక విపరీతాలు చోటు చేసుకోవడం లాంటి కారణాలను ఆపాదించడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛలో ‘ఉత్తమ’ స్థాయిలో 8 (4.4 శాతం) దేశాలు, ‘సంతృప్తికర’ స్థాయిలో 44 దేశాలు (24.4 శాతం), ‘ప్రాబ్లమాటిక్‌’గా 55 దేశాలు (30.6 శాతం), ‘డిఫికల్ట్‌’ స్థాయిలో 42 దేశాలు (23.3 శాతం), ‘వెరీ సీరియస్‌’ స్థాయిలో 31 దేశాలు (17.2 శాతం) దేశాలు ఉన్నట్లు వివరించబడిరది. పత్రికా/మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు గొడుగు పడుతుందని, రాజకీయ అరాచకాలు పెరిగితే పత్రికా/మీడియా స్వేచ్ఛకు తూట్లు పడతాయని తెలుసుకోవాలి. పత్రికలు, మీడియా చానెల్స్‌ తటస్థంగా వాస్తవ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని, రాజకీయ పార్టీలు/కార్పొరేట్‌ చేతుల్లోకి మీడియా వెళితే ప్రజాస్వామ్య విలువలు పతనం అవుతాయని తెలుసుకోవాలి. ప్రజల నాడి, పాలకుల అవినీతి, కార్పొరేట్ల అనైతిక వ్యాపార ధోరిణిలను మీడియా సమాజ కళ్ల ముందుంచాలని, నీతివంతమైన ప్రభుత్వ పాలనకు పత్రికలు/చానెల్స్‌ పునాదులు కావాలని కోరుకుందాం. మీడియా/పత్రికా స్వేచ్ఛలను సంకెళ్ల నుంచి విముక్తం చేద్దాం.

  • డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి 9949700037
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు