- భారీగా దరఖాస్తులు వెల్లువ
- కుదరని ఏకాభిప్రాయాలు
- తలలుపంటుకుంటున్న నేతలు
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఆ పార్టీ ఇటీవల చేపట్టిన దరఖాస్తుల పక్రియ కొత్త పంచాయితీలకు తెరలేపింది. ఎమ్మెల్యే టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్న వారిలో గ్రామస్థాయి నాయకులు సైతం ఉండడం ఆ పార్టీ దుస్థితికి అద్దంపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ములుగు, భూపాలపల్లి మినహా అన్ని చోట్లా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. వారందరిలోనూ టికెట్ తనకే వస్తుందన్న ధీమా ఉండగా వర్గపోరు మరింత పెరిగింది. కొన్నిచోట్ల ఆధిపత్య పోరు తారస్థాయికి చేరగా పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. టికెట్ ఎవరికి వచ్చినా మిగతా వారు వ్యతిరేకంగాపనిచేసే పరిస్థితి కనిపిస్తుంది.
కాంగ్రెస్ పార్టీలో అదే అయోమయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన వారు దొరక్క ఆ పార్టీ ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల్లో గెలవడం మాట పక్కనబెడితే బీఆర్‌ఎస్‌కు కనీసం పోటీ ఇచ్చే స్థాయి నేతలు లేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. పదేండ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో ప్రజల్లో అధికార పార్టీపై సానుకూలత కొనసాగుతున్నది. ప్రజలకు పదేండ్లుగా దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి పాలవుతున్నది. పదవుల కోసం రాజకీయం చేస్తుండడంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రజలకు దగ్గరగా లేకపోవడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేసే వారు సైతం ఆ పార్టీకి దొరకడం లేదు. జనంతో సంబంధం లేనివారు, ఎన్నికల కోసమే పార్టీలో చేరుతున్న వారే దిక్కవుతున్నారు. బీఆర్‌ఎస్‌పై పోటీ చేసే అభ్యర్థులు లేక నైరాశ్యం నెలకొన్నది. ఆధిపత్యం కోసం ఆరాటంతో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ తీరు దయనీయంగా ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో ఒకటి రెండు చోట్ల తప్ప కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవలు, వర్గపోరు కొనసాగుతున్నది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ లేని దుస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల దరఖాస్తు ప్రక్రియ చేపట్టింది. దీంతో గ్రామ స్థాయి నాయకులు సైతం ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసిన అందరూ ఒక్కటే కావడంతో కొన్ని సెగ్మెంట్ల విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సెగ్మెంట్‌లోనూ మండల స్థాయి నాయకులు వారితో సమానంగా టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ సెగ్మెంట్లలో అందరూ ఒక్కటే అనే పరిస్థితి వచ్చింది. దరఖాస్తు చేసిన అందరిలోనూ టిక్కెట్ తమకే అనే ధీమా కనిపిస్తున్నది. ఈ పరిస్థితితో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం మరింత పెరుగుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ములుగు, భూపాలపల్లి మినహా అన్ని స్థానాల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియతో ఎక్కువ నియోజకవర్గాల్లో వర్గపోరు పెరిగింది. జనగామ నియోజకవర్గంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఎర్రమళ్ల సుధాకర్, గిరి కొండల్‌రెడ్డి టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పొన్నాల, కొమ్మూరి వర్గాలు ఇప్పటికే వర్గాలుగా విడిపోయాయి. మరో ఇద్దరు దరఖాస్తు చేసుకోవడంతో వర్గాలు పెరిగాయి. స్టేషన్ ఘన్‌పూర్ సెగ్మెంట్‌లో సింగపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్య, చేపూరి వినోద్, డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ, గంగారపు అమృతరావు, డాక్టర్ రాజమౌళి టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికి టిక్కెట్ వచ్చినా మిగిలిన వారు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేసే పరిస్థితి ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గంలో అనుమాండ్ల రaాన్సీరెడ్డి, అనుమాండ్ల తిరుపతిరెడ్డి, లక్ష్మీనారాయణనాయక్, బండి సుధాకర్‌గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. ముగ్గురూ నియోజకవర్గానికి కొత్తవారే. బీఆర్‌ఎస్ అభ్యర్థితో పోటీపడే నేత లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నది. డోర్నకల్ నియోజకవర్గంలో జాటోత్ రాంచంద్రునాయక్, మాలోత్ నెహ్రూనాయక్, నునావత్ భూపాల్‌నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నలుగురు తలో దిక్కు అన్నట్లుగా ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. మహబూబాబాద్ సెగ్మెంట్‌లో బలరాంనాయక్, బెల్లయ్యనాయక్, భూక్యా మురళీనాయక్, నునావత్ రాధ, నునావత్ రమేశ్, దస్రూనాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ మంది ఆశావహులు ఉండడంతో ఎవరికి టిక్కెట్ వచ్చినా మిగిలిన వారు ప్రతికూలంగా చేసే అవకాశం ఉన్నది. నర్సంపేట నియోజకవర్గం నుంచి దొంతి మాధవరెడ్డి, కత్తి వెంకటస్వామి దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ రెండువర్గాలు విడిపోయి ఉన్నది. వీరిలో ఎవరికి రాకున్నా ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటారని ప్రచారం జరుగుతున్నది. వరంగల్ తూర్పు సెగ్మెంట్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షురాలు మధ్య వర్గపోరు కొనసాగుతున్నది. వీరిద్దరితో పాటు ఎంబాడి రవీందర్, అజ్మతుల్లా హుస్సేని టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాలుగు గ్రూపులుగా మారింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా ఉన్నది. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మరో నేత జంగా రాఘవరెడ్డి మధ్య ఇప్పటికే వర్గపోరు కొనసాగుతున్నది. వీరికి తోడు కట్ల శ్రీనివాస్, రేపల్లె శ్రీనివాస్, తకళ్లపల్లి సారిక, రేపల్లె రంగనాథ్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వర్ధన్నపేట నమిండ్ల శ్రీనివాస్, కేఆర్ నాగరాజు, బక జడ్సన్, సిరిసిల్ల రాజయ్య, సుంచు రవి, బందెల భద్రయ్య, పులి అనిల్, ఆనంద్‌కుమార్, నరుకుడు వెంకటయ్య, యాకస్వామి, పెరుమాండ్ల రామకృష్ణ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు. వీరిలో నియోజకవర్గ స్థాయి నేతలు ఎవరూ లేకపోవడంతో సెగ్మెంట్‌లోని కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నది. పరకాల నియోజకవర్గంలో ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, కొండా మురళీధర్‌రావు, అవేలి దామోదర్, కటూరి దేవేందర్‌రెడ్డి, బొమ్మతి విక్రమ్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ ఇప్పటికే రెండు, మూడు వర్గాలు విడిపోయింది. టిక్కెట్ల దరఖాస్తు తర్వాత వర్గాలు మరిన్ని పెరిగాయి.