Friday, April 19, 2024

మహా మాయలోడు మాగంటి..!

తప్పక చదవండి


( డబుల్ బెడ్ రూం ఇండ్ల ఆశ చూపి మోసం చేసారు : కమలా నగర్ బస్తీ నాయకులు షేక్ హైదర్.. )

  • ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మా స్థలాలను లాక్కున్నారు..
  • పక్కా ఇళ్ళు వస్తాయని నమ్మి బొక్క బోర్లా పడ్డాం..
  • ఎమ్మెల్యే తన అనుచరులకు ఇండ్లు కట్టబెడుతున్నారు..
  • మా బ్రతుకులను ఆగం చేస్తున్నారు..
  • సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో మీడియాతో గోడు
    వెళ్లబోసుకున్న బాధితులు..
  • జూబ్లీ హిల్స్, కమలానగర్ బస్తీలో వెలుగుచూసిన ఘటన..

తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో నిరుపేదలకు ఆశలు రగిల్చింది.. సొంత గూడు వస్తుంది కదాని, ఆశగా ఎదురుచూసిన వారికి చివరికి నిరాశే మిగిలింది అన్నది కళ్ళముందు కనిపిస్తున్న సత్యం.. ఎన్ని ఇండ్లు నిర్మించారో..? ఎంతమందికి కేటాయించారో..? అన్నది ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా సరైన జవాబు చెప్పే దమ్ము ప్రభుత్వం దగ్గర లేకపోవడం శోచనీయం.. ఏవేవో లెక్కలు చెబుతూ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎంతోమందికి ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వానికి నిర్మించిన ఇండ్లు ఎవరికీ కేటాయించకుండా దెయ్యాల కొంపల్లా దర్శణం ఇస్తూ ప్రభుత్వ నిర్లక్షానికి నిలువెత్తు అద్దంలా నిలిచిపోయాయి.. తాజాగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కమలానగర్ లో చోటుచేసుకున్న వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు మాయని మచ్చలా మిగిలిపోయింది.. వివరాలు చూద్దాం..

- Advertisement -

హైదరాబాద్ : 1988 ఆగస్టు 16 తేదీన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కమలానగర్ పేరున 35 మందికి పట్టాలు ఇచ్చారు. వీటిలో లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకున్నారు.. ఆ తర్వాత అక్కడ దేవాలయం, చర్చి, మసీదు, మదరసా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు.. తాగునీరు లేకపోయినా కష్టపడి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారు.. కాగా 13 గుడిసెలతో మొదలైన కమలానగర్ కాలనీ 2001 కి, 198 మంది దాకా పోగయ్యారని కమలానగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ హైదర్ పేర్కొన్నారు. అయితే 2003 డిసెంబర్ 23న అప్పటి తెలుగుదేశంలో మంత్రి పదవిలో ఉన్న విజయరామరావు 108 పట్టాలిచ్చారు. అది అప్పటి కలెక్టర్ భన్వర్ లాల్ చేతుల మీదుగా అక్కడి వారికి అందజేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 1+2 గా ఇండ్లు కడతామని చెబితే సంతోషంగా ఒప్పుకున్నామని ఆయన తెలిపారు.. అందరూ గుడిసెలు ఖాళీ చేశారు.. ఆ తరువాత స్థానిక టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కమలానగర్ బస్తీకి వచ్చారు. అక్కడ పర్యటించి, స్థానిక పరిస్థితులు అంచనా వేసి అక్కడి వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చి నమ్మించారు. తదనంతరం కమిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు.. రూ.14 లక్షలు 70వేలు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం శాంక్షన్ చేశారు.. తర్వాత అనేక గొడవలు జరిగి కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఆగిపోయింది.. రాజకీయ పార్టీలకు మధ్య జరిగిన గొడవల్లో బస్తి వాసులు నలిగిపోయారు.. కాగా ప్రస్తుతం ఎమ్మెల్యే గోపీనాథ్ తమ స్థలాలు తీసుకుని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి, యిప్పుడు తామే మోసం చేశామంటూ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని షేక్ హైదర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి.. ఒక బస్తీ లీడర్ పై నేరుగా అవినీతి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. నిజానికి బస్తీ వాసులుగా తమకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థానంలో బయట వ్యక్తులకు.. వాళ్ళ పార్టీకి సంబంధించిన వారికి ఆయన కట్టబెడుతున్నారు. అది ప్రశ్నించినందుకు గాను తమపై అవినీతి ఆరోపణ చేస్తూ.. లబ్ధిదారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా ఆయన రెండు రోజుల క్రితం ఒక తెలుగు పత్రికలో ఆరోపణలు చేయడం అన్యాయం.. ఇన్నేళ్లుగా ఆ కాలనీలో అన్ని అసౌకర్యాలను భరిస్తూ బ్రతికిన తమపై ఎమ్మెల్యే గోపీనాథ్ ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని షేక్ హైదర్ తెలిపారు.. ఈ మేరకు ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు.. సుమారు వందమంది ఈ సమావేశానికి విచ్చేసి షేక్ హైదర్ తమ వద్ద ఎటువంటి సొమ్ములు వసూలు చేయలేదని తెలపడం గమనార్హం.. ఎమ్మెల్యే అనుచరుడైన ఠాగూర్ మనుషులు వాళ్ళ పార్టీకి చెందిన టిఆర్ఎస్ నాయకులకు డబుల్ బెడ్ రూములు అప్పగించి.. దాని నుండి తప్పించుకోవడానికి ఆ విమర్శల నుండి తప్పించుకోవడానికి బస్తీ లీడర్ గా తమకు ఎన్నో విషయాల్లో సాయం చేసిన షేక్ హైదర్ ని అవమానిస్తున్నారని, ఆయనపై కేసులు కూడా పెడుతున్నారని బాధితులైన బస్తీ వాసులు ఆరోపించారు.. తమ నాయకుడు షేక్ హైదరకు ఎటువంటి ప్రమాదం జరిగినా దానికి బాధ్యులు జూబ్లీహిల్స్ టీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అవుతారని అని వాళ్ళు మీడియా ముందు హెచ్చరించారు..

అయితే పేదల ఓట్లతో గెలిచి, ఎమ్మెల్యే పదవిని చేపట్టి.. వారికి నిజాయితీగా సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధి.. మోసపూరిత వ్యవహారాలకు పాల్పడటం శోచనీయం.. ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకుంటున్న నిరుపేదలైన వారికి మాయమాటలు చెప్పి.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశజూపి.. వారి స్థలాన్ని స్వాధీనం చేసుకుని.. అక్కడ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తన వారికి కట్టబెట్టి.. అర్హులైన వారిని రోడ్డుమీదకు లాగడం అన్యాయమని స్థానికులు వాపోతున్నారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ్యవహారాన్ని స్వార్ధ ప్రయోజనాలకోసం వినియోగించుకోవడం ఎంతవరకు సమంజసం..? నిరుపేదలైన వారు ప్రెస్ క్లబ్ కు వచ్చి తమగోడును మీడియా ముందు వెల్లబోసుకోవడం సిగ్గుచేటు.. తాము ఎన్నుకున్న నాయకుడు తమకు న్యాయం చేయకపోగా, తీవ్ర అన్యాయం చేయడంతో తమకు న్యాయం జరిగేలా చూడాలని ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ముందు వాపోవడం ప్రతి ఒక్కరినీ కదిలించివేస్తోంది.. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యవహారాలపై దృష్టిపెట్టి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.. తమకు సరైన న్యాయం జరగకపోతే.. రాబోయే ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు