Thursday, April 25, 2024

నాశిరకం పనులు.. కోట్లల్లో బిల్లులు..

తప్పక చదవండి


ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగుతున్న అధికారులు, కాంట్రాక్టర్లు..

  • స్థానిక ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న వైనం..
  • జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ – 7, చార్మినార్ జోన్,
    మొగల్ పూరా డివిజన్ లో వెలుగు చూసిన ఘటన..
  • కాంట్రాక్టర్ రాజగోపాల్, ఏఈఈ మాజిద్ ల చేతివాటం..
  • అవినీతి పరులను కఠినంగా శిక్షించాలంటున్న స్థానికులు..
  • భవిష్యత్ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్..

హైదరాబాద్ : కాంట్రాక్టర్ల ధనదాహం, కొందరు ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి.. వెరసి ప్రజా జీవితానికి ప్రతిబంధకంగా మారుతున్నాయి.. ప్రభుత్వం నుంచి వచ్చే కోట్లాది రూపాయల సొమ్మును, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వినియోగించాల్సిన తరుణంలో కక్కుర్తితో నాశిరకం పనులు చేస్తూ ప్రజా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించాల్సిన జీ.హెచ్.ఎం.సి. లోని కొందరు అవినీతి ఉద్యోగుల వల్ల ఆ వ్యవస్థ నీరుగారిపోతోంది.. నాలాల మీద ప్రయాణించాలన్నా.. వర్షపు నీరు సక్రమంగా ప్రవహించాలన్నా నాలాల నిర్మాణం అత్యంత భద్రతగా నిర్మించాల్సిన అవసరం ఉంది.. కానీ అవినీతి రాజ్యమేలుతున్న జీ.హెచ్.ఎం.సి. వ్యవస్థలో నిబంధనలకు పాతర వేస్తూ.. ప్రజా జీవనానికి పెనుసవాల్ విసురుతూ.. పనులను చక్కబెడుతూ.. అక్రమ సంపాదనతో జేబులు నింపుకుంటున్న అవినీతి వ్యవహారాలు ఇబ్బడి ముబ్బడిగా చోటుచేసుకుంటున్నాయి.. వివరాల్లోకి వెళ్తే..

- Advertisement -

జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ – 9, చార్మినార్ జోన్, మొగల్ పుర డివిజన్ 33లో ఇంటి నెంబర్ : 23-3-623 మస్కతి డైరీ నుండి ఇంటి నెంబర్ : 18-7-212 / 28 /1 /28 జహంగీర్ నగర్, మొగల్పూరు వరకు ఆర్.సి.సి. బాక్స్ డ్రైన్ లను రీ మోడల్ చేయడానికి ప్రభుత్వం వారు రూ. 3,61,31,386 శాంక్షన్ చేశారు.. కాగా బాక్స్ డ్రైన్ నిర్మాణం నాలా క్రింది భాగంలో ప్లైన్ సిమెంట్ కాంక్రీట్ వేసి, సైడ్ వాల్స్ కూడా ఆర్.సి.సి. వేస్తూ, స్లాబ్ కూడా ఆర్.సి.సి. తో నిర్మించాల్సి ఉంటుంది.. జీ.హెచ్.ఎం.సి. ఆమోదించిన ఎస్టిమేషన్ ప్రామాణికాల ప్రకారం నిర్మాణం కొనసాగించాల్సి ఉంటుంది.. కానీ జీ.హెచ్.ఎం.సి. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. సదరు కాంట్రాక్టర్ నాలా కింద పీసీసీ వేయకుండానే తూతూ మంత్రంగా సిమెంట్ పూత వేసి డ్రైన్ నిర్మాణం చేసినట్లు తెలియవచ్చింది.. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సైడ్ వాల్స్ కూడా ఆర్.సి.సి.తో కాకుండా పాత గ్రానెట్ కట్టడానికే పై పై పూతలు వేస్తూ పని కానిస్తున్నట్లు తెలుస్తోంది.. పైన కూడా ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సరైన స్టీల్ ఉపయోగించకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.. ఇలాంటి నాశిరకం నిర్మాణాల వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.. భారీ వర్షం కురిస్తే కింది భాగం కొట్టుకుని పోవడమే కాకుండా.. నాలా మీదనుండి ప్రయాణించే వాహనాల తాకిడికి నాళాలు కుంగిపోయి ప్రమాదాలు ఏర్పడతాయి.. ప్రభుత్వం విడుదల చేసే పైకాన్ని నాణ్యత నిర్మాణం కోసం వినియోగించకుండా కొంతమేర ఖర్చుపెట్టి, నిర్మాణాలు సాగించి మిగిలిన సొమ్మును అక్రమంగా కాజేస్తున్నారు.. కాంట్రాక్టర్ రాజగోపాల్ తో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాజిద్ లోపాయికారి ఒప్పొందం చేసుకుని అక్రమంగా ప్రభుత్వ ధనాన్ని తెగమింగుతున్నారు.. తమ జేబులు నిందుతున్నాయని భావిస్తున్నారు కానీ ఎదురయ్యే ప్రమాదాలను పట్టించుకోవడం లేదు.. కేవలం సొంత లాభాలకోసం ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్న ఇలాంటి అధికారులను, కాంట్రాక్టర్లను కఠినంగా శిక్షించి ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు భవిష్యత్తులో ఎదురుకాకుండా ప్రభుత్వం విడుదల చేస్తున్న పైకం ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని, జీ.హెచ్.ఎం.సి. ఉన్నతాధికారులను, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు